Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభRajendra Prasad: ఆ సమయంలో చనిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad: ఆ సమయంలో చనిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad: . డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రయాణం ఆరంభించిన నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన కెరీర్ ఆరంభంలో సినిమా అవకాశాల్లేక, చేతిలో డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. బాధలు పడలేక చివరకు ఆత్మహత్య కూడా చేసుకుందామని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

- Advertisement -

ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

‘‘మా నాన్న స్కూల్‌ టీచర్‌. చాలా కఠినంగా ఉండేవారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నేను నిర్ణయించుకున్నా. అందుకు ఆయన కాస్త అసహనం వ్యక్తంచేశారు. నీ ఇష్టానికి వెళ్తున్నావు. సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ ఏది వచ్చినా అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిల్‌ అయితే ఇంటికి రావద్దు అన్నారు. మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. గోల్డ్‌ మెడల్‌ సాధించా. అయితే అవకాశాలు మాత్రం రాలేదు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్లా. రావద్దు అన్నాను కదా ఎందుకు వచ్చావు అని నాన్న కోప్పడ్డారు. బాధగా అనిపించి వెంటనే మద్రాస్‌ వచ్చేశా. చనిపోదామనుకున్నా. చివరగా నా ఆత్మీయులందరినీ ఒక్కసారి చూడాలనిపించి.. వాళ్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడా.

అలా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్‌కు వెళ్లా. ‘మేలుకొలుపు’ సినిమాకు సంబంధించి అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. ఆఫీస్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన నన్ను చూసి డబ్బింగ్‌ థియేటర్‌కు తీసుకువెళ్లారు. ఒక సీన్‌కు నాతో డబ్బింగ్‌ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చింది. భలే సమయానికి దొరికావు అన్నారు. రెండో సీన్‌కు డబ్బింగ్‌ చెప్పమనగానే.. భోజనం చేసి మూడు నెలలు అయింది. భోజనం పెడితే డబ్బింగ్‌ చెబుతానన్నా.(భావోద్వేగంతో) అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పా. దానికి ఆయన కోప్పడి ఇంటికి తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టించారు. నాకు ధైర్యం చెప్పారు. అలా నా డబ్బింగ్‌ ప్రయాణం మొదలైంది. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పా. అలా వచ్చిన డబ్బుతో మద్రాస్‌లో ఇల్లు కట్టా. అక్కడే నాకు దర్శకుడు వంశీతో పరిచయమైంది. వంశీ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా’’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News