Pawan Kalyan| ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఆయన క్రేజ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తం అయింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో 100శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించడంతో పవన్ పేరు మార్మోగిపోయింది. సాక్షాత్తూ పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ ఏకంగా పవన్‌ను తుఫాన్ అని సంబోధించడం ఆయనకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుంది.
ఇక సనాతన ధర్మంపై పోరాటానికి పవన్ నడుం బిగించడంతో ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ పవన్‌కు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి మరాఠీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ క్రమంలో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో పవన్ దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారిపోయారు.
తాజాగా ఏపీలోని కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందనే వార్తలతో పవన్ ఆ పోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. పోర్టులోకి అడుగు పెట్టిన వెంటనే అధికారులను స్మగ్లింగ్ షిప్ గురించి వివరాలు ఆరా తీశారు. ఈ తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేతో పాటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షిప్ దగ్గరకు వెళ్తున్న సమయంలో పోర్టు అధికారులు సహకరించలేదని మండిపడ్డారు.
ఎందుకు సహకరించడం లేదని నవ్వుతూనే ‘సీజ్ ద షిప్’ అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పవన్ అన్న ఈ మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇండియా మొత్తం సోషల్ మీడియాలో ఆ పదం ట్రెండింగ్‌లో మార్మోగింది. తెలుగు రాష్ట్రాల అభిమానులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు పవన్ వీడియోను షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్‌పై మరోసారి విస్తృత చర్చ జరుగుతోంది.