అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి బి.జె.పి.లో చేరడానికి సిద్దమవుతున్నారా? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ స్థానం నుండి బరిలో దిగడానికి ప్రణాళికలు రచిస్తున్నారా? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారంతో పాటు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అల్ఫోర్స్ విద్యాసంస్థలకు అధినేత అయిన నరేందర్ రెడ్డి రాజకీయాల్లో సైతం రాణించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
2018లోనే పొలిటికల్ ఎంట్రీ:
గత 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఆశించి ఆ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. అందుకు కాంగ్రెస్ నాయకత్వం సైతం సుముఖత వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ నాయకత్వం 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ మాజీ ఎం.పి., టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కూడా చేసేదేమి లేక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు సైతం ఆయన ఆర్థికంగా సహకారం అందించినట్లు ప్రచారం సైతం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని ఆయన ప్రణాళికలు సైతం రూపొందించుకున్నారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఓటమి పాలవ్వడం, మళ్ళీ ఆయనకే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎం.పి. టికెట్ కేటాయించడంతో నరేందర్ రెడ్డి పొలిటికల్ డైలమాలో పడ్డారు. ఇక అప్పటినుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ విద్యాసంస్థల కార్యకలాపాల్లోనే నిమగ్నం అవుతూ వస్తున్నారు.
బి.జె.పి. చూపు.. నరేందర్ రెడ్డి వైపు:
ఇదిలా ఉండగా 2019లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బి.జె.పి. పార్టీ నుండి బండి సంజయ్ విజయం సాధించారు. అప్పటి టి.ఆర్.ఎస్. సిట్టింగ్ ఎం.పి. బోయినపల్లి వినోద్ కుమార్ పై విజయం సాధించడంతో పోరుగడ్డ కరీంనగర్ లో బి.జె.పి. శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. కరీంనగర్ లో బి.జె.పి. పట్టు మరింత పెంచుకోవడానికి నరేందర్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు అప్పటి నుండే దృష్టి సారించారు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా అప్పటి నుండి మౌనం వహిస్తూ వస్తున్నారు.
ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు :
ఇది ఎలక్షన్ సంవత్సరం కావడంతో నరేందర్ రెడ్డిని బి.జె.పి.లోకి తీసుకురావడానికి ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ సిట్టింగ్ ఎం.పి. బండి సంజయ్ మధ్య ఇప్పటికే ఈ విషయంపై పలు దఫాలుగా చర్చలు జరిగినట్లు ప్రచారం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్, వేములవాడ లేదా ఎల్.బి.నగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి బరిలో దిగుతారనే సంకేతాలు వెలువడుతుండగా బి.జె.పి.లో కరీంనగర్ ఎం.పి. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. బండి సంజయ్ మాత్రం బి.జె.పి.కి సిట్టింగ్ ఎం.పి. స్థానం అయిన కరీంనగర్ లో వచ్చే ఎలక్షన్ లో సైతం విజయభేరి మోగించాలంటే నరేందర్ రెడ్డి సరైన అభ్యర్థి అని భావిస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పేరు ఉంది. ఆయనకు టికెట్ ఇచ్చి బరిలో దింపితే వచ్చే లోక్ సభ ఎన్నికలో కరీంనగర్ లో గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని, పోరుగడ్డపై మళ్ళీ కాషాయ జెండాను రెపరెపలాడించవచ్చని బండి సంజయ్ ధీమాగా ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా బి.జె.పి. నుండి నరేందర్ రెడ్డికి టికెట్ కేటాయించి బరిలో దింపితే మాత్రం కరీంనగర్ స్థానంలో మిగతా పార్టీలకు గట్టి పోటీ ఉంటుందనే చర్చ కొనసాగుతోంది.