మద్య విక్రయాలకు సంబంధించి జరిగిన అవకతవకలకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంతో అధి కారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో పలువురిని ఇదివరకే అవినీతి ఆరోపణ లపై సీబీఐ అరెస్టు చేయడం జరిగింది. సరికొత్త ఆబ్కారీ విధానాన్ని రూపొందించి అమలు చేసిన ఆప్ ప్రభుత్వం గత ఏడాది ఈ విధానాన్ని రద్దు చేసింది. అయితే, ఈ విధానం అమలులో అనేక అవకతవకలకు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత కొంత కాలంగా వెంటాడుతున్నాయి. సీబీఐ తదితర కేంద్ర సంస్థలను ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కేంద్రం ఉపయోగించుకుంటోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీతో సహా వివిధ ప్రతిపక్షాలు విమర్శ లకు దిగాయి. ఒక్క ఢిల్లీలోనే కాక, పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆప్ విజయం సాధించ డానికి, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ప్రయత్నించడానికి సిసోడియా కారణమైనందువల్లే కేంద్రం ఆయన మీద కక్ష కట్టిందంటూ ముఖ్యమంత్రితో సహా ఆప్ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
కాగా, ఈ మద్య విధాన అమలులో జరిగిన అవకతవకలకు సంబంధించి తమకు అందిన స్పష్టమైన సమాచారం ఆధారంగా తాము సిసోడియాను విచారిం చడం ప్రారంభించామని, అయితే, ఆయన తమకు సహకరించకపోవడం, సమాధా నాలు దాటవేయడం వంటి కారణాల వల్ల తాము ఆయనను అరెస్టు చేయడం జరిగిం దని సీబీఐ సమాధానం ఇచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగానే సీబీఐ ఆయనపై విచారణ జరుపుతోంది తప్ప తాము సీబీఐని ఆయనపైకి ఉసిగొల్ప లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవినీతి ఎక్కడ జరిగినా దానికి అడ్డుకట్ట వేసి, బాధ్యులను విచారించడం మొదటి నుంచి తమ విధానమని, ఈ విధానానికి తగ్గట్టు గానే సీబీఐ వ్యవహరిస్తోందని కేంద్రం వివరించింది.
ఈ వివాదాస్పద ఆబ్కారీ విధానాన్ని గత ఏడాది జూలై నెలలోనే రద్దు చేయడం జరిగింది. ఈ విధానం అమలులో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుం టున్నాయంటూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమే కాకుండా, సీబీఐ విచారణకు కూడా అభ్యర్థించారు. మద్య విక్రయాలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. అయితే, మద్య వ్యాపారుల నుంచి లంచాలు, ముడుపులు తీసుకుని లైసెన్సులు మంజూరు చేస్తున్నారని, లైసె న్సులు జారీ చేయడంలో కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారికి సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్నవారికి, తమను ఆశ్ర యించినవారికి లైసెన్స్ ఫీజు రద్దు చేయడం కూడా జరుగుతోందని, లైసెన్సులను రిన్యూవల్ చేయడంలో కూడా ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారని పలువురు ఆప్ నాయకులపై ఆరోపణలు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా, ఈ విధానం అమలులో కొన్ని లోపాలున్నాయంటూ ఆప్ ప్రభుత్వం చివరికి ఈ విధానాన్ని రద్దు చేసింది. అయితే, ఇందులోని లోపాలేమిటో మాత్రం ఆప్ ప్రభుత్వం వెల్లడించలేదు.ఇప్పుడు సీబీఐ మనీశ్ సిసోడియాకు ఈ అవకతవకలు, అవినీతి కార్యకలాపాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సం బంధం ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేయాల్సి ఉంది. ఈ విధంగా సీబీఐ నిర్ధారణ చేయ లేకపోయిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి దుర్వినియోగం చేస్తోందన్న ఆప్ ఆరోపణ నిజమని తేలిపోతుంది. ప్రస్తుతం సీబీఐ విశ్వసనీయత మీదే కాక, సిసో డియా విశ్వసనీయత మీద కూడా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. సిసోడియా మీద నమ్మకంతో అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు మొత్తం 33 ప్రభుత్వ విభాగాల్లో 18 విభాగాలను అప్పగించడం జరిగింది.
ఈ దర్యాప్తులో సీబీఐ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేవలం ప్రతిపక్ష ప్రభుత్వాలలోని మంత్రులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందని, బీజేపీ పాలిత రాష్ట్రాలలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందనే అపప్రథ తొలగిపోవాల్సి ఉంది. సిసోడియాతో పాటు, ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తీరుపై కూడా దర్యాప్తు జరపాల్సి ఉందని ఆప్ నాయకులు కోరుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాల మీద కేం ద్రం ప్రతీకారాలకు పాల్పడుతోందనే అభిప్రాయం కూడా తొలగిపోవాల్సి ఉంటుంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారో పణలు ప్రభుత్వ విశ్వసనీయతకు గొడ్డలిపెట్టుగా తయారవుతాయి.