Nadendla Manohar| గత వైసీపీ స్రభుత్వంలో ఐదేళ్లపాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేశామన్నారు. గోదాం యజమానులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బియ్యం డోర్ డెలివరీ అంటూ అక్రమ రవాణాకు తెరలేపారని ఆయన విమర్శించారు. కాకినాడ పోర్టు(Kakinada Port)ను స్మగ్లింగ్ డెన్‌గా మార్చారని మండిపడ్డారు. కోటి 60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారని తెలిపారు. ఈ బియ్యం విలువ దాదాపు రూ.45 వేల కోట్లు ఉంటుందన్నారు.
ఇదంతా మాజీ సీఎం జగన్(Jagan)కు తెలియకుండా జరదన్నారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టులో గత ప్రభుత్వ హయాంలో కేవలం 20 మంది పోలీసులను మాత్రమే పెట్టారన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించెదవరో అందరికీ తెలియాలన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ చేసే వారందరి పేర్లు బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పర్యటనతో స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది అన్నారు. గతంలో బియ్యం అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు ఎందుకు మాట్లాడలేదని నాదెండ్ల నిలదీశారు.