డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజారాహిల్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో
ఐఎంఏ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఇంపాక్ట్ కాన్ 2024లో జరిగిన చర్చా వేదికపై వైద్యులపై జరుగుతున్న దాడులు ప్రధానంగా చర్చకు వచ్చాయని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయని చెప్పారు. ఇదే అంశాన్ని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు వివరించామని చెప్పారు. దాడుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారన్నారు. పీసీసీ చీఫ్, స్పీకర్ ల చొరవతో రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారని ప్రభుకుమార్ తెలిపారు.
ఇంపాక్ట్ కాన్ చీఫ్ గెస్ట్ గా గవర్నర్
మరోవైపు ఇంపాక్ట్ కాన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమాజంలో వైద్యుల పోషిస్తున్న పాత్రను కొనియాడారు. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రబలినప్పుడు ప్రాణాలకు తెగించి వైద్యులు చేసిన సేవను గవర్నర్ గుర్తు చేశారు. కార్యక్రమలో భాగంగా సామాజిక సేవ, వైద్య, పర్యావరణ పరిరక్షణ, మీడియా తదితర రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి గవర్నర్ అవార్డులు అందజేశారు.
సైటిఫిక్ సెమినార్
వైద్య రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లు, వాటిని అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే అంశాలపై నిపుణులైన వైద్యుల సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు. ఆంకాలజీ, కార్డియాలజీ, ఆండ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర విభాగాల్లో డాక్టర్ల ప్రజెంటేషన్ విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమంలో కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జె.ఎ. జయలాల్, ఐఎంఎ తెలంగాణ ప్రసిడెంట్ ద్వారకనాథ్ రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ మహేష్ కుమార్, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవీంద్రా రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.