ఏటూరునాగారం ఎన్కౌంటర్ (Eturnagaram Encounter) పై పౌర హక్కుల నేతలు వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసుకి సంబంధించిన తదుపరి చర్యలు, పోస్టుమార్టం రిపోర్టును అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే మల్లయ్య మృతదేహాన్ని గురువారం వరకు భద్రపరచాలని, మిగిలిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదే పిటిషన్ పై నిన్న (సోమవారం) విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు… మృతదేహాలను ఈరోజు వరకు భద్రపరచాలని పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. ఏటూరునాగారం (Eturnagaram) లో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ (Encounter) చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్న తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని, పోస్టుమార్టం చీకట్లో నిర్వహించారని కోర్టుకు చెప్పారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టుకు వెల్లడించారు. మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ… అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మృతదేహాలను భద్రపరిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, అందుకే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం మృతదేహాలను ఈరోజు వరకు భద్రపర్చాలని, కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. నేటి విచారణలో తాజా ఆదేశాలు జారీ చేసింది.