PSLVC-59| శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టాల్సిన పీఎస్‌ఎల్వీసీ-59(PSLV C59) రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహం(Proba-3 Satellite)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇస్రో(ISRO)శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు 25 గంటల పాటు కొనసాగిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59ను మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. అయితే కాసేపట్లో ఆకాశంలోకి రాకెట్ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో సమస్యను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(European Space Agency) గుర్తించారు. వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రేపు(గురువారం) సాయంత్రం 4.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. అంతకుముందు ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు.