Harbhajan Singh : టీమ్ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుందనే చర్చ గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ స్పందించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్‌లు ఉంటే బాగుంటుందని చెబుతూనే టీ20 ఫార్మాట్‌కు తన సహచరుడైన ఆశిశ్ నెహ్రా కోచ్ అయితే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో ప్రస్తుత కోచ్‌ను రాహుల్ ద్రవిడ్ తక్కువ చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదని చెప్పుకొచ్చాడు.
ద్రవిడ్‌తో కలిసి చాలా కాలం ఆడాను. అతడి గురించి, ఆటపై అతడికున్న అవగాహన గురించి తనకు పూర్తిగా తెలుసునని భజ్జీ చెప్పాడు. అయినప్పటికీ టీ20 జట్టు కోచ్ పదవికి నెహ్రా అయితేనే పూర్తి న్యాయం చేయగలడని బావిస్తున్నట్లు తెలిపాడు. నెహ్రాకు టీ20 ఫార్మాట్‌పై మంచి పట్టుఉందని, కెరీర్ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, ఈ విషయం కారణంగానే తన ఓటు నెహ్రాకు వేస్తానని అన్నాడు. అలాగని ద్రవిడ్‌ను పక్కకు పెట్టాలని తాను చెప్పడం లేదన్నాడు. ఆశిశ్, రాహుల్‌లు కలిసి పనిచేస్తే 2024 ప్రపంచకప్ సమయానికి జట్టును మరింత మెరుగ్గా నిర్మించవచ్చునని తెలిపాడు.
భారత టాప్ -3 ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలపై ఫామ్ గురించి కూడా స్పందించాడు. వీరు ముగ్గురు తమ స్ట్రైక్ రేట్‌పై మరింత దృష్టి సారించాలని సూచించాడు. వీరు బాగా ఆడితే నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. ఇక రోహిత్ తరువాత టీ20లకు కెప్టెన్‌గా ఎవరుంటారు అనే ప్రశ్నకు తానైతే హార్థిక్‌కే ఓటు వేస్తానని అన్నాడు.