ఇది ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా? అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. “ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు” అని మండిపడ్డారు.
కాగా, గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. ఎస్ఐని అడ్డుకుని హల్చల్ చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఇవాళ ఉదయం ఆయనను కొండాపూర్ నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), జగదీశ్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.