హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కి భారీ ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో పంజాగుట్టలో నమోదైన కేసులో హరీష్ రావును అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అరెస్టు మినహా దర్యాప్తు కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. విచారణకి సహకరించాలని హరీష్ రావుకి సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా, హరీష్ రావు పంజాగుట్టలో ఆయనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును సవాల్ చేస్తూ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.
రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో తనని ఇరికిస్తున్నారని ఆరోపించారు. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారంటూ సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ రావు పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి తన ఫోన్ కాల్స్ రికార్డ్ చేశారని, తనని బెదిరించారని చక్రధర్ ఆరోపించారు.