జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామం మల్లన్నపేటలో శ్రీ మల్లికార్జున స్వామి దొంగ మల్లన్నగా, షష్టి మల్లన్నగా భక్తుల నిత్యపూజలు అందుకుంటున్నారు.
భక్తులు కోరి మొక్కితే, కోర్కెలు తీర్చే స్వామిగా ఆయనకు పేరుంది. ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి మొదలు షష్టి 7 వారాల పాటు పూజలందుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉత్తరాన 62 కి.మీ. దూరంలో, జగిత్యాల జిల్లాకు తూర్పున 12 కి.మీ. దూరాన మల్లన్నపేటలో ఈ ఆలయం ఉంది. ఈ స్వామివారిని గొల్ల, కుర్మ కులస్తులు ఒగ్గు పూజరులుగా వ్యవహరిస్తారు.
దొంగ మల్లన్న అనటం వెనుక కథ ఇది
కొన్నేళ్ల క్రితం దొంగలు పొలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను దొంగిలించారు. వీరు వస్తుండగా దారిలో ఓ వ్యక్తి చూసి, ఇవి రాజు గారి ఆవులని గుర్తించాడు. దొంగలు తాము దొరికిపోతామన్న భయంతో మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి, ఆవుల రంగుల మార్చి, గుర్తు పట్టకుండా చేస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. అనుకున్నది నెరవేరడంతో స్వామి వారికి రాత్రికి రాత్రే గుడి కట్టారనే నానుడి. ఈ కారణంగా ఆలయాన్ని దొంగ మల్లన్న ఆలయమని పిలుస్తున్నారు. మార్గశిర శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్టికి ప్రారంభం కావడంతో షష్టి మల్లన్న జాతర అని కూడా పిలుస్తారు.
7 వారాలపాటు జాతర
ఆలయం ఎదుట మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం, దండివారం జాతర, నాగవెల్లితో ప్రారంభమై మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజుతో షష్టి 7 వారాలపాటు జాతర సాగుతుంది. స్వామి వారికి ఇష్టమైన ఆది, బుధవారాల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. జాతరకు వచ్చిన ప్రతీ కుటుంబం స్వామివారికి గూడన్న భోనం సమర్పణ తీయడం ఆనవాయితీ. కోరిన కోర్కెలు తీరితే తమ బరువెత్తు బెల్లం (బంగారం) తుల భారం వేసి ప్రసాద పంపిణీ తలనీలాలు ఇవ్వడం, స్వామి వారికి ఒడి బియ్యం బంగారం వెండి కానుకలు సమర్పించడం, గండాదీపంలో నూనె పోయడం, ఆలయ మండపంలో గంటలు కట్టడం, గోసేవా చేయడం, తదితర రకాల్లో మొక్కు చెల్లించుకుంటారు.
తేదీలు.. కార్యక్రమాలు
డిశంబర్ 06-12-2024 (శుక్రవారం) రాత్రివేళ స్వామివారి కల్యాణ మహోత్సవం,
7-12-2024 (శనివారం) దండివారం,
08-12-2024 (ఆదివారం) జాతర
09న (సోమవారం) నాగవెల్లి, పెద్దపట్నం, అగ్ని గుండాలు.
ఏడూవారాల జాతర తేదీలవివరాలు
08, 11, 15, 18, 22, 25, 29, /12-2024
(బుధ, అది) వారల్లో జాతర జరుగుతుంది.
జాతర చివరి రోజు డిశంబర్ 30న (సోమవారం) మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీహవనం, పూర్ణాహుతితో ముగుస్తుంది.
భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు చలువ పందిళ్లు వైద్యసేవలు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తులకు జగిత్యాల పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం ఉంది.
పైన పేర్కొన్న తేదీల్లో జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో స్వామి వారిని దర్శించి తరించుటకు వేలాది సంఖ్యలో విచ్చేస్తారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం విక్రమ్, ఆలయ ట్రస్టీ పౌండర్ కొండూరి శాంతయ్య ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.