తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోందని, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం ఇచ్చారు.
గతంలో మేమూ ఇచ్చాం
రాజకీయాలు లేవని, గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా తామంతా సమాచారాన్ని ఇచ్చామని మంత్రి పొన్నం గుర్తుచేశారు. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పలువురు నాయకులు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదని పొన్నం అన్నారు, రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలని, సమాచారాన్ని ఇవ్వకుండా బీసీలకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా భావం ఉంటే చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న సర్వేలో రాజకీయ నేతలు లేకుండా ఉంటే మంచిది కాదని, సమాచార శాఖలో లీడర్లు భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టి విమర్శించడం కాదని, సమాచార లోపంతో, అవగాహనా లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యతగల వాళ్లుగా అందరూ సమాచారాన్ని ఇచ్చేలా ఈ సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.