Friday, September 20, 2024
Homeనేషనల్Summet HOT:మార్చి నుంచే మండే ఎండలు, ఏప్రిల్‌, మే నెలల్లో ఫుల్ ఎండలు

Summet HOT:మార్చి నుంచే మండే ఎండలు, ఏప్రిల్‌, మే నెలల్లో ఫుల్ ఎండలు

భానుడు ఫిబ్రవరి నెల నుంచే భగభగమనడం ప్రారంభించాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరివారం లోనే 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు జిల్లా కౌతాళంలో నమోదైంది. మంగళవారంనాడు 37.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత విజయనగరం జిల్లా కొత్తవలసలో నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.
ఏప్రిల్‌, మేలో తీవ్రతరం…
ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉంటాయని, దీంతోపాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు విపత్తుల సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న వాతావరణం వేరు, రానున్న కాలంలో పరిస్థితులు వేరుగా ఉంటాయని మార్చి నుంచే ఎండలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు.
భారత వాతావరణ సంస్థ (ఐఎండి) సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
2017 నుంచి 2021 వరకు వరుసగా 46.7°C ,43.1°C, 46.4°C, 47.8°C, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాగా, గతేడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా గుడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వివరించారు. 2016లో 723 , 2017లో 236, 2018లో 8, 2019లో 28 వడగాల్పుల మరణాల నమోదుకాగా విపత్తుల సంస్థ, జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో 2020,21,22లో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి నాలుగు రోజుల ముందుగా ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. వేసవి కాలం ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన అకాల వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున ఎండలతోపాటుగా ఆకస్మిక భారీవర్షాలు. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలు విపత్తుల సంస్థ హెచ్చరిక సందేశాలు అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

దినసరి కూలీలు ఉదయంపూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలని సూచించారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలంటున్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News