రేషన్ కార్డు అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత / ఆధారం అనే విధానానికి స్వస్తి పల్కి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ద్వారా రేషన్ బియ్యం దోపిడీని నియంత్రిచవచ్చని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రేషన్ బియ్యం పంపిణీలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకు ప్రత్యేక గుర్తింపు కార్డులు సంబందిత శాఖ ద్వారా జారీచేయాలన్నారు. పి.డి.ఎఫ్. బియ్యం దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన “ సిట్ “ పేదల బియ్యం దోపిడీ ముఠా ఆటను కట్టిస్తుందన్నారు. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అవినీతి బియ్యం వ్యాపారంతో కాదని, సక్రమమైన ఎగుమతులు – దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.
పేదలకు పట్టెడు అన్నం పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ రూ.2/- కిలో బియ్యం పథకం ప్రారంభించారన్నారు. పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ జీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించారు, దీనికి అదనంగా జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ఇచ్చే బియ్యం అదనం అన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, ఆ బియ్యాన్ని విదేశాలకు మళ్లించడం ఎంతో క్రూరమైన చర్య అన్నారు. 2019 – 24 మధ్య పేదలకు అందాల్సిన రూ.80 వేల కోట్ల ఉచిత బియ్యంలో సింహ భాగం అవినీతిపరులకు ఆదాయ మార్గంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం కావడం బాధాకరం అన్నారు. ప్రస్తుతం దాదాపు 10 వేల కోట్లు కేంద్రానికి, 6 వేల కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం వ్యయం అవుతుందని, గడచిన 5 సంవత్సరాలలో రమారమి మొత్తం 80 వేల కోట్లు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం 50 వేల కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్లు ఖర్చు అయ్యిందన్నారు.
ఇప్పటి వరకు అధికారుల నుండి లభించిన సమాచారం మేరకు 2019 – 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం దాదాపు రూ. 30,000 కోట్లని, 59,08,146 రేషన్ కార్డులకు గాను 1,63,51,364 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. 2019 – 24 మధ్య కేంద్ర ప్రభుత్వం దాదాపు చేసిన వ్యయం రూ. 49,200 కోట్లని, 89,35,525 కార్డులకు గాను 2,68,30,006 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. మొత్తం రేషన్ కార్డులు : 1,48,43,671 అయితే లబ్ధిదారుల సంఖ్య 4,31,81,370 అని, మొత్తం వ్యయం రూ. 79,200 కోట్లు అని ఆయన తెలిపారు.