Saturday, November 23, 2024
Homeనేషనల్SC: ప్యానెల్ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించాలి

SC: ప్యానెల్ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించాలి

ఎన్నికల కమిషనర్స్ ఎంపికపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు ఎన్నికల కమిషనర్స్ ను ఎవరు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటూ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈమేరకు సరికొత్త ఆదేశాలు జారీచేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్స్ ను నియమించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆదేశించింది.

- Advertisement -

సుప్రీంకోర్టు జడ్జిల నియామకం కొలీజయం ద్వారా సాగినట్టే ఈసీ సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ఓ పద్ధతి ప్రకారం సాగాలన్న వ్యాజ్యంపై గతేడాది 24వ తేదీన వాదనలు విన్న సుప్రీంకోర్టు మార్చి నెలకు తీర్పును రిజర్వు చేయగా ఈరోజు ఆ తీర్పును వెలువరించింది. తమకు అనుకూలురైన వ్యక్తులను ఈసీలు, సీఈసీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజా తీర్పుతో కేంద్రానికి ఈ విషయంలో సుప్రీం మార్గదర్శకత్వం చేసినట్టైంది. నిజానికి ఇదో చారిత్రాత్మక తీర్పని, కేంద్రానికి చెంప పెట్టులాంటిదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.

జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులున్న కాన్స్టిట్యూషన్ బెంచ్ లో జస్టిస్ అజయ్ రస్తోగి, అనిరుద్ధా బోస్, హ్రిషికేశ్ రాయ్, సీటీ రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. తాజా తీర్పుతో భవిష్యత్తులో జరిగే సీఈసీ, ఈసీ నియామకాలన్నీ స్వతంత్ర కొలిజీయం లేదా సెలెక్షన్ కమిటీనే పూర్తి చేస్తుంది.

కాగా ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ రిక్రూట్మెంట్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తూ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ గోయల్ ను కొత్త ఎన్నికల కమిషనర్ గా మోడీ సర్కారు మెరుపు వేగంతో నియమించటాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామక ప్రక్రియ అంతా కేవలం 24 గంటల్లో పూర్తి అయింది. అయితే గోయల్ నియామక ప్రక్రియలో ఎటువంటి కలవర పడాల్సిన విషయం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించిందికూడా.

అయితే తాము గోయల్ అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించటం లేదని, కేవలం గోయల్ నియామక ప్రక్రియ విధానాన్ని ప్రశ్నిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక అరుణ్ గోయల్ విషయానికి వస్తే ఆయన నవంబర్ 18న ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆమరుసటి రోజే నవంబర్ 19న ఎలక్షన్ కమిషనర్ గా కేంద్రం ఆయన్ను నియమించింది. ఇక నవంబర్ 21వ తేదీన ఆయన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు కూడా. దీంతో ఈసీ నియామకాలపై వివాదం రాజుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News