BRS MLAs: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ వ్యవహారాలు, క్వశ్చన్ అవర్, వాయిదా తీర్మానాలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవాళ, రేపు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ(MCHRD)భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.
అయితే ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, సభలోనికి రాకుండా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి తమ సభ్యులు హాజరుకావడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా డిసెంబర్ 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరిగాయి. అనంతరం ఉభయ సభలను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేశారు. ఈలోపు బీఏసీ మీటింగ్‌లో చర్చించి ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.