Manchu Vishnu| తమ కుటుంబ వివాదంపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలోనూ ఉన్నట్లు తమ కుటుంబంలోనూ గొడవలు ఉన్నాయని తెలిపారు. అందుచేత ఈ వివాదాన్ని సంచలనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తాము ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉంటామని అనుకున్నామని.. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిందని వాపోయారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నారని.. నాన్న కూడా రాత్రి ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరిగినందుకు ఇంటి పెద్ద కుమారుడిగా తాను చాలా బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. తమను అమితంగా ప్రేమించడమే మోహన్ బాబు(Mohan Babu) చేసిన పెద్ద తప్పు అన్నారు.
కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తనకు ఫోన్ వచ్చిందన్నారు. కుటుంబమే ముఖ్యమని అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కుటుంబ పెద్దలు ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని.. త్వరలోనే తాము మళ్లీ తిరిగి కలుస్తామని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇక నిన్న జరిగిన ఘర్షణలో ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును నాన్న కొట్టలేదని.. ముఖంపై మైక్ పెట్టేసరికి ఆయనకు కోపం వచ్చి అలా జరిగిపోయిందన్నారు. ఆ జర్నలిస్టు కుటుంబానికి టచ్‌లో ఉన్నామని విష్ణు వ్యాఖ్యానించారు.