Rahul Gandhi| పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani) లంచం ఆరోపణలు అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సభాసమావేశాలు సజావుగా జరగడం లేదు. తాజాగా పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajanath Singh) లోపలకు వెళ్లేందుకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఆయనకు జాతీయ జెండా, గులాబీ పువ్వును అందజేశారు. రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్‌నాథ్ స్వీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అదానీ, ప్రధాని మోదీ(PM Modi) ఇద్దరు హగ్ చేసుకున్న ఫొటోలను బ్యాగుల మీద ముద్రించి కాంగ్రెస్ సభ్యలు నిరసన తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీపై రూ.2500కోట్ల లంచలం ఆరోపణలు చేసినా ప్రధాని ఎందుకు స్పందించం లేదని నిలదీశారు. మోదీ-అదానీ బాయ్ బాయ్ అంటూ విమర్శలు చేశారు. ఈ ఆందోళనల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చావల కిరణ్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.