Avanti Srinivas| వైసీపీకీ మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. దయచేసి వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
కాగా 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అప్పటి నుంచి పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీ లేదా జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతముందు ఆయన 2014లో టీడీపీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే.