గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో BRS పార్టీ ధర్నా చేపట్టింది. మంత్రి మల్లారెడ్డి కలిసి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందని, అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని హరీష్ మండిపడ్డారు. 2019 లో 37,209 కోట్ల సబ్సిడీ ఉంటే, 2023 లో 180 కోట్లకు తగ్గించిన ఘనత మోడీ సర్కారుదే అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 లో బిజెపి అధికారం లోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉండే, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారని ఆరోపించారు. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారని, నాడు గ్యాస్ ధరలు 400 ఉంటే అప్పటి బిజెపి నేతలు గగ్గోలు పెట్టారని ఆయన గతాన్ని గుర్తుచేశారు. స్మృతి ఇరానీ గ్యాస్ బండతో రోడ్ల మీద ధర్నా చేశారని.. ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉన్నా ఆమెలో చలనం లేదన్నారు.
“ప్రధానమంత్రి ఎందుకు చాయి పే చర్చ పెడుతున్నారు? సిలిండర్ ధరలు పెంచడం వల్ల చాయ్ అమ్ముకునేవారి పై భారం పడ్తలేదా? 400 సిలిండర్ ఈరోజు 1100 చేశామని చాయి బండి కాడ చర్చ పెట్టండి”అంటూ హరీష్ సవాలు చేశారు.
ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోదీ ప్రభుత్వం.. మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చిందన్నారు. బీజేపీ పాలన అచ్చే దిన్ కాదని, ధరల పెరుగుదలతో సామాన్యుడు భయపడి సచ్చేదిన్ అవుతోందని ఆయన ఆరోపించారు.
Harish Rao: ‘అచ్ఛేదిన్’ కాదు సామాన్యుడు ‘సచ్చే దిన్’
- Advertisement -