KTR| లగచర్ల ఘటన(Lagacharla Incident)లో జైలు జీవితం గుడుపుతున్న రైతు హీర్యానాయక్(Hiryanayak)కు గుండెనొప్పి వచ్చింది. దీంతో పోలీసులు ఆయనను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఘటనలో అరెస్టైన రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్న రైతు హీర్యానాయక్‌కు నిన్న గుండె నొప్పి వచ్చిందని కానీ పోలీసులు ఆ విషయాన్ని బయటకు రాకుండా సైలెంట్‌గా ఉంచారని మండిపడ్డారు. కనీసం గుండెనొప్పి వచ్చినట్లు ఆయన కుటుంబసభ్యులకు కూడా తెలియజేయలేదని ఫైర్ అయ్యారు. మళ్లీ ఇవాళ గుండెనొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారని ధ్వజమెత్తారు. ఈలోపు ఆయనకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నించారు.
గుండెపోటు వచ్చిన వ్యక్తికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా 40 మంది రైతులు జైలులో మగ్గుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రానికి రారాజు, చక్రవర్తిలా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.