లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్థా వద్ద గల 63వ జాతీయ రహదారిపై ప్రతి గురువారం నిర్వహించే వారసంత వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి కావడం వల్ల నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రహదారికి ఇరువైపులా కూరగాయల వ్యాపారులు అలాగే పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లపై అమ్మకాలు కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోయింది.
గురువారం వచ్చిందంటే చాలు
గురువారం వచ్చిందంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రహదారి గుండా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంతకు వచ్చే వినియోగదారులు ఇక్కడ నెలకొన్న సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిపై వారసంత ఏర్పాటు ప్రమాదకరమైనదని ప్రజలు చెబుతున్న అప్పటి పాలకవర్గం తమ స్వలాభం కోసం ఇక్కడ వారసంతను ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ట్రాఫిక్ సమస్యతో
సంతకు వచ్చే వర్తకులు, వినియోగదారులకు మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం లేక అనేక రకమైంటువంటి అవస్థలు పడుతున్నారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు కూడా స్థలం లేకపోవడంతో వినియోగదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో వారపు సంత వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఏదేమైనప్పటికి ప్రతి గురువారం నిర్వహించే వారసంతను ఇబ్బంది లేని ప్రదేశాలను గుర్తించి ఏర్పాటు చేయాలని, ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.