నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నల్లమల అరణ్యంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి జన్మస్థలం అహోబిలంను ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ ను నంద్యాల ఎంపీ, లోక్ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షేఖావత్ ను ఆయన కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా ఎంపీ శబరి కలిసి విన్నవించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఏటా జరిగే అహోబిలం పారువేట ఉత్సవాన్ని జాతీయ పత్రికల జాబితాలో సంస్కృతీ సంపదగా నమోదు చేయాలని, యునెస్కో ఐసీహెచ్ గుర్తింపు కోసం అంగీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సిఫారసు చేసి వినతి పత్రాన్ని ఎంపీ శబరి కేంద్ర మంత్రికి అందజేశారు.
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు కల్పించడమే కాకుండా, ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో కూడా సహాయపడుతుందని, యునెస్కో గుర్తింపు వల్ల మా ప్రాంత పర్యాటక అభివృద్ధికి, ప్రజా చైతన్యానికి, స్థానిక కళల సంరక్షణకు పునాదులు వేయవచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి వివరించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మస్థలం అహోబిలాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ శబరి కోరారు.