Mohan Babu| జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనపై నటుడు మోహన్ బాబు తాజాగా స్పందించారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ దాడి పట్ల చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు.
మోహన్ బాబు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలి. మీడియా వారిపై దాడి చేయాలని దైవసాక్షిగా అనుకోలేదు. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు మీడియా వాళ్లా? ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు నేను బాధపడుతున్నాను. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడి లాంటివాడు. మీడియా ప్రతినిధి భార్యాబిడ్డల గురించి ఆలోచించాను. నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు. నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు.
నటులు, రాజకీయ నాయకుల విషయాలు ఉన్నవి ఉన్నట్లు.. లేనవి ఉన్నట్లు చెబుతుంటారు. కానీ అందరూ సైలెంట్ గానే ఉన్నారు. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ ఇంట్లోకి వచ్చాడు అది రైటా? రాంగా? చెప్పాలి. విలేకర్లు నాలుగు రోజుల నుంచి తన ఇంటి ముందు లైవ్ వ్యాన్ లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ సబబు. తాను దండంపెట్టి చెప్పినా వినిపించుకోలేదు.
నీతిగా, ధర్మంగా బతకాలన్నదే నా ఆలోచన. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే నాపై 50 కేసులు పెట్టుకోవచ్చు, నన్ను అరెస్టు చేసుకోవచ్చు. నేనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టు అయ్యే వాడిని. నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. నా బిడ్డతో ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుంది. మేం కూర్చొని మాట్లాడుకుంటాం. కుటుంబసభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయం ప్రస్తావిస్తున్నారు. నేను కొట్టిన విషయం తప్పే, కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. మీకు టీవీలు ఉండొచ్చు, నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే, అసత్యం కాదు’’ అని మోహన్ బాబు వెల్లడించారు.