Harish Rao| తెలంగాణలో ఇటీవల గురుకులాల్లోని వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురుకులాలపై బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహారం నాణ్యతగా పెడుతున్నారా అని వార్డెన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉన్న సమస్యలఫై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కూడా తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హాస్టల్లో మెను పాటిస్తున్నారా..? సరైన భోజనం పెడుతున్నారా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వరుస క్రమంలో నిల్చొని భోజనం పెట్టించుకుని వారితో కలిసి తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.