Allu Arjun: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్‌ల పై 105, 118 ( 1 ) ఆర్/డబ్ల్యు3 (5 ) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. అయితే ఆ తీర్పు రాకముందే బన్నీని పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్‌ను తన ఇంట్లో అరెస్టు చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈ కేసులో నేరం రుజువు అయితే అల్లు అర్జున్‌కు ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.