Saturday, November 23, 2024
Homeనేషనల్SC: "నోర్ముసుకో, బయటికెళ్లు"..ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం

SC: “నోర్ముసుకో, బయటికెళ్లు”..ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం

సుప్రీంకోర్టులో ఈరోజు ఓ విచిత్రమైన విషయం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చాలా పెద్ద గొంతుతో కోర్టులో అరిచేశారు. వికాస్ సింగ్ అనే సీనియర్ లాయర్ సుప్రీంకోర్టు లాయర్లకు ఛాంబర్ కేటాయింపు కేసు విషయంలో ధర్మాసనం మద్దతివ్వాలంటూ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ను కోరారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ.. కీప్ క్వైట్, లీవ్ కోర్ట్ రైట్ నౌ (నోర్మూసుకుని కోర్టు నుంచి బయటికెళ్లు) అంటూ కసిరేశారు.

- Advertisement -

సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన వికాస్ సింగ్ లాయర్ల తరపున ప్రత్యేక అంశాన్ని ధర్మాసనం వద్ద ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టుకు కేటాయించిన ఖాళీ స్థలంలో లాయర్ల ఛాంబర్ గా వాడుకునే కేసు విషయంలో వాదనలు వినాలంటూ అభ్యర్థించారు. గత ఆరు నెలలుగా తమ కేసు బెంచ్ ముందు వాదనలకు రాకుండా పోవటంతో లాయర్లు ఎలాగైనా కేసు లిస్టు చేయించే పనుల్లో ఉన్నారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ , లాయర్ వికాస్ సింగ్ మధ్య గట్టిగా వాదోపవాదనలు సాగాయి.

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్: “మీరు ఇలా డిమాండ్ చేయరాదు, రోజంతా మేమేమైనా ఖాళీగా కూర్చుంటున్నామా?”

వికాస్ సింగ్: “నేనేమీ అలా అనట్లేదు, ఈ విషయం ఇలాగే కొనసాగితే మీఇంటి వద్దకు వస్తానన్నా”

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్: “ప్రధాన న్యాయమూర్తినే బెదిరించద్దు, ఇలాగేనా మీరు ప్రవర్తించేది ? మార్చ్ 29, 2000 నుంచి నేను ఇక్కడే ఉన్నా, గత 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నా, ఎవరి వద్దా నేను తలవంచలేదు. మరో రెండేళ్ల నా కెరీర్ లో కూడా నేను ఆ పని చేయను. నిన్ను సాధారణ లిటిగెంట్ గానే పరిగణిస్తున్నాం , నా చేతికి పని చెప్పొద్దు అన్నారు. అంతే కాదు గట్టిగా నోరు చేయకు”అని కూడా చంద్రచూడ్ హెచ్చరించారు.

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్: “గత 20 ఏళ్లుగా లాయర్లు ఛాంబర్ కోసం కాచుకుని కూర్చున్నారన్న విషయం నన్ను బాధించింది, ఇందుకు అవసరమైన చర్యలు బార్ చేపట్టడం లేదంటే మమ్మల్ని అలుసుగా తీసుకోరాదు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్: “గట్టిగా మాట్లాడద్దు, ఎస్సీబీఏ అధ్యక్షులూ ..ఇది మాట్లాడే విధానమే కాదు, సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని బార్ కు ఇవ్వమని మీరు అడుగుతున్నారు, నేను నా నిర్ణయం తీసుకున్నా, అది 17వ తేదీన వెలువరిస్తాం ప్రస్తుతానికి ఆ అంశం ఇక్కడ అప్రస్తుతం” అంటూ చీఫ్ జస్టిస్ స్పష్టంచేశారు.

ఈ మొత్తం వాదోపవాదనల తరువాత సీనియర్ లాయర్లు కపిల్ సిబాల్, ఎన్ కే కౌల్ ఇద్దరూ ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News