జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్(Allu Arjun) గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం బాధాకరమని.. అది అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నారు.
తాను బాగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తానని.. చట్టానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందని.. ఇప్పుడు ఏం మాట్లాడలేనని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా థియేటర్లో సినిమాలు చూస్తున్నానని.. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదన్నారు.
అంతకుముందు తన నివాసానికి చేరుకున్న బన్నీని భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.