Allu Arjun: జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను ఆయన మేనత్త, చిరంజీవి(Chiranjeevi) సతీమణి సురేఖ(Surekha) కలిశారు. బన్నీ నివాసానికి వెళ్లిన సురేఖ.. అల్లు అర్జున్‌ను చూడగానే కాస్త భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని హత్తుకుని సురేఖ ఎమోషనల్ అవ్వగా ఆయన ధైర్యం చెప్పారు. అనంతరం తాజా పరిణామాల గురించి తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడే సురేఖ సోదరుడు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. కాగా బన్నీ అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.
అంతకుముందు దర్శకులు కె.రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు బన్నీని కలిశారు. కేసుకు సంబంధించిన విషయాలతో పాటు తాజా పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా సుకుమార్ బన్నీని చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.