KTR| బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురుకులా పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీఆర్ఎస్(BRS) పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలు అధిరోహిస్తే.. ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యార్థులను ఆసుపత్రి మెట్లు ఎక్కించారని విమర్శించారు.
‘‘కాంగ్రెస్ పాలనలో సామాన్య విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగాయి. సంక్షేమ పాఠశాలలను సంక్షోభంగా మార్చి భయాందోళనకు గురి చేశారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయి. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. కెమెరాల ముందు హంగామా చేయడం కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి.. సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి.. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ’’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.