Bhatti Vikramarka: తెలంగాణలో నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త తెలిపారు. త్వరలోనే 6వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఒక రోజు హాస్టల్ తనిఖీ’లో భాగంగా ఖమ్మం, మధిర, బోనకల్‌లోని సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన మెనూ అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్స్‌లో నేటి నుంచి కొత్త మెనూను అధికారికంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ నుంచి పీజీ వరకు సవరించిన ధరల ప్రకారం రూ.2100 చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.