Wednesday, December 18, 2024
HomeతెలంగాణMahesh Kumar Goud: ప్రజలు ఓడించినా బుద్ధి మారలేదు.. కేసీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ...

Mahesh Kumar Goud: ప్రజలు ఓడించినా బుద్ధి మారలేదు.. కేసీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ

పదేళ్ల పెత్తందారు పాలనతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీనికి ఓడించినా కేసీఆర్(KCR)కు, ఆయన కుటుంబ సభ్యుల్లో, పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పూ రాలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) విమర్శించారు. ఇదే పంథాలో సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

- Advertisement -

‘తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు. కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరు. మీ అల్లుడు హరీశ్‌రావు పెట్రోల్ డబ్బాతో, అగ్గిపులతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ రాజకీయ ఉపాధి కల్పించుకున్నారు.

మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను పూర్తి చేయలేకపోయారు. నోటిఫికేషన్ ఇచ్చాక మీ అనుచరులతోనే కోర్టుల్లో కేసులు వేయించి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. పదో తరగతి మొదలు గ్రూప్-1 పరీక్షల వరకు అన్నింటా అవకతవకలు, గందరగోళమే. మీ పాలనకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌దే. మీ హయాంలో అవినీతిమయమైన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు నెలకొల్పాం.

25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం గర్వంగా భావిస్తున్నాం. మూసీ పునరుజ్జీవంలో అవినీతి ఉందని కేటీఆర్‌ గగ్గోలు పెడుతున్నారు. మూసీ పునరుజ్జీవం డీపీఆర్‌ కోసం రూ.150 కోట్లే ఖర్చు చేశాం. మూసీ కోసం అదనంగా వ్యయం చేయలేదని మీరు గుర్తించాలి. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. కానీ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక కార్యక్రమాలను విమర్శిస్తూ పోతే ప్రజలు హర్షించరని, తరిమి కొడుతారు. తెలంగాణ తల్లి రూపురేఖలపై విమర్శలు చేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనం. ముఖ్యంగా కేటీఆర్‌ (KTR), హరీశ్‌రావు (Harish Rao), కవితను కేసీఆర్‌ అదుపులో పెట్టాలి’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News