భారత్‌లో 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశంలో కొత్త రాజ్యాంగం కింద 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. స్వాతంత్య్రం తర్వాత అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం అదే తొలిసారి. తర్వాత 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించారు. కేరళలో 1957 ఎన్నికలలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చి, ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత చేయాలనుకున్న ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వాటిలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) ఒకటైతే.. రెండోది జమిలి ఎన్నికలు. లోక్‌సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని.. అందుకోసం జమిలి ఎన్నికలను ప్రవేశపెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడైతే లోక్‌సభతో పాటు కేవలం నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీలకే ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత ఐదేళ్ల పాటు ప్రతియేటా కొన్ని కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉంటున్నాయి. వేర్వేరు సమయాల్లో జరిగే పరిణామాల ప్రభావం ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద కొంతవరకు పడుతుంది. దానికితోడు.. ప్రతిసారీ ఎన్నికల నిర్వహణ పేరుతో బోలెడంత కసరత్తు కూడా అవసరం అవుతుంటుంది. ఈ ప్రయాసలన్నీ తప్పాలంటే దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. స్థానిక సంస్థలను పక్కన పెట్టి, కేవలం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న తలంపుతో.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఒక కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ సిఫార్సులు, మరికొన్ని అంశాలు సేకరించిన కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును రూపొందించి.. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే అంటే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు ఈ జమిలి ఎన్నికల బిల్లు రానుంది. ఈ బిల్లుకు ఎవరు అనుకూలంగా ఉన్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు.. ఎవరు తటస్థంగా ఉన్నారో ముందుగా ఒకసారి చూద్దాం.
కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీయే అధికారంలో ఉందన్న మాటే గానీ దానికి మూడింట రెండొంతుల మెజారిటీ లేదు. ప్రస్తుతం సాధారణ మెజారిటీ మాత్రమే ఉంది. మామూలు బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అది సరిపోతుంది. కానీ, రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం మూడింట రెండొంతుల మద్దతు అవసరం. ఎన్డీయేకు అంత బలం లేదు. దీంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. 542 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది మద్దతుంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది మద్దతు అవసరం. మంత్రివర్గంలో భాగస్వామ్యమున్న టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఇప్పటికే బిల్లుకు మద్దతిచ్చాయి. 243 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు 122 మంది సభ్యుల మద్దతుంది. ప్రస్తుత ఖాళీలను భర్తీ చేస్తే మరికొంత మద్దతు పెరుగుతుంది. అయినా సరిపోదు. అప్పుడు ఇతర పక్షాల మద్దతు అవసరం.
జమిలి ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు అవి నిజంగా దేశానికి మంచివేనా.. కాదా అన్న విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. సహజంగానే అధికార పక్షానికి అండగా ఉన్నవారు అది మంచిదని చెబుతుంటే, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అబ్బే అంటూ పెదవి విరుస్తారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు విస్తృతమైన ఏర్పాట్లు అవసరం అవుతాయి. ముందుగా అన్నిచోట్లా ఎన్నికలు పెట్టేందుకు తగినన్ని ఈవీఎంలు కావాలి. దాంతోపాటు శాంతిభద్రతల విషయం కూడా చూసుకోవాలి. సున్నితమైన రాష్ట్రాల్లో రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేనిచోట అయితే ఒకే విడతలో పూర్తిచేస్తారు. వీటిని బట్టే బలగాల మోహరింపు అంశాన్నీ గమనించాలి. శాంతిభద్రతల నిర్వహణకు కేంద్ర బలగాలను పంపుతుంటారు. కానీ ఒకవేళ జమిలి ఎన్నికలు పెడితే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి పంపాల్సి వస్తే అందుకు తగినంత సంఖ్యలో బలగాలు ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకమే. పొరుగు దేశాలతో సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూకశ్మీర్ లాంటి ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా సున్నితంగా ఉంటుంది.
విడిగా ఎన్నిక ఎప్పుడు మొదలైంది?
భారత్‌లో 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశంలో కొత్త రాజ్యాంగం కింద 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చాక అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం అదే తొలిసారి. తర్వాత 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించారు. కేరళలో 1957 ఎన్నికలలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. కానీ, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చి, ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభు త్వం రద్దుచేసింది. దాంతో 1960లో కేరళలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. సరిగ్గా అప్పుడే ఏకకాలంలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. వివిధ కారణాల వల్ల వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడం మొదలైంది. తెలంగాణలో కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఐదేళ్లు పూర్తికాకముందే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అందువల్ల ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ కంటే సుమారు ఏడాది ముందే తెలంగాణ ఎన్నికలు జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం లోక్‌సభతో పాటే జరుగుతాయి.
1967 తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందుగానే రద్దు చేశారు. అక్కడ రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాక, 1972లో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందస్తుగా నిర్వహించారు. 1967లో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిశా లాంటి అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు లేదా వాటి కూటములు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ, ఈ ప్రభుత్వాలలో చాలావరకు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోకముందే, అసెంబ్లీలను రద్దు చేసుకున్నాయి. ఇలా 1967 తర్వాత ఏకకాలంలో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌కు విఘాతం ఏర్పడింది.
సాంకేతికంగా ఏం చేయాలి?
ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు తొలుత రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్‌లో సవరణ అవసరం. అసెంబ్లీల పద వీ కాలానికి, రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న ప్రొవిజన్లను మార్చా ల్సి ఉంటుంది. ఇంకా ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్న నిబంధనలను మార్చాలి. అవిశ్వాస పరీక్షలను నిర్మాణాత్మకంగా ఉండేలా రూపొందించాలి. అవిశ్వాస తీర్మానంతో పాటు, ఏ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలపాలి. దీనిపై సభకు విశ్వాసం ఉండాలి. దీంతో, పాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వంతో లోక్‌సభ లేదా అసెంబ్లీ పదవీ కాలాన్ని ఐదేళ్లపాటు కొనసాగించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం సాధ్యమేనా?
అసలు నిర్వహణా పరమైన అంశాలను పక్కన పెట్టి.. పదవీకాలం వేర్వేరుగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న ఇక్కడ కీలకం. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీని ముందుగా రద్దు చేసే హక్కు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది తప్ప కేంద్రానికి కాదు. ఏదైనా కారణం చేత రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు ఏర్పడితే, అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయగలదు. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకేసారి సాధ్యం కాదు. పదవీకాలం పూర్తి కాకుండానే ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఇది మన దేశంలోని సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి కూడా ఇది విరుద్ధం. రాష్ట్రాలకు విఘాతం కలిగించే అధికారం పార్లమెంటుకు లేదు. జమిలి ఎన్నికల తర్వాత ఏదైనా రాష్ట్రంలో ఒక పార్టీకి లేదా కూటమికి మెజారిటీ రాకపోతే, రాజకీయ అస్థిర పరిస్థితులు నెలకొంటాయి.
ప్రతిపాదన ఎప్పటి నుంచి మొదలైంది?
లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1983లోనే లేవనెత్తారు. కానీ, ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 1999లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ‘లా కమిషన్’ ప్రతిపాదించింది. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. 2014లో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే అంశాన్ని కూడా చేర్చింది.
ఇండియా కూటమి మాటేంటి?
‘‘భారత్ అనేది రాష్ట్రాల సమాఖ్య. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనేది ఈ సమాఖ్యపై, అన్ని రాష్ట్రాలపై దాడి లాంటిది’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో ట్వీట్ చేశారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యంపై దాడేనని తృణమూల్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ, సమాఖ్య వ్యతిరేకమని స్పష్టం చేశారు. జమిలి బిల్లును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుబట్టారు. అసాధ్యమైన, ప్రజా వ్యతిరేకమైన ఈ బిల్లు ప్రాంతీయ పార్టీల గొంతు నులిమేస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లును క్యాబినెట్ ఆమోదించడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని యావత్ ప్రజానీకం ప్రతిఘటించాలని పిలు పునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లాభం?
ఇటీవల లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమికి (టీడీపీ, బీజేపీ, జనసేన) జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల లాభం గానీ, నష్టం గానీ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఇది కాస్త లాభదాయకమే. ఇక్కడ లెక్క ప్రకారం 2028లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ 2029లో జమిలి ఎన్నికలు జరిగితే పదవీకాలం ముగిసినా కొంతకాలం ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా ఐదారునెలలు అదనంగా పాలించే అవకాశం రేవంత్ ప్రభుత్వానికి ఉంటుంది.
ఇండియా కూటమి నుంచి మద్దతు లభిస్తుందా?
రాజ్యాంగ సవరణకు అవసరమైనంత బలం ఎన్డీయే వద్ద లేకపోవడంతో తప్పనిసరిగా ఇండియా కూటమి నుంచి కొంత మ ద్దతు తీసుకోవాల్సి వస్తుంది. అందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వాళ్లు మళ్లీ మరోసారి తమ రాజకీయ చాతుర్యం చూపించాల్సి ఉంటుంది. గతంలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సి వచ్చినప్పుడు నిజానికి రాజ్యసభలో ఎన్డీయేకు ఆధిక్యం లేదు. అయినా అమిత్ షా అత్యంత చాకచక్యంగా ఆ బిల్లును ఆమోదింపజేసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి జమిలి ఎన్నికల బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం పొందుతారన్నది ఎన్డీయే వర్గాల ఆశాభావం. అయితే, అంతకుముందు ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ సూచించే కొన్ని మార్పు చేర్పులు చేస్తే అప్పుడు ప్రతిపక్షం కొంత సంతృప్తి చెంది.. బిల్లుకు కాస్తో కూస్తో మద్దతు పలికే అవకాశం లేకపోలేదు.
ఎన్నికల ఖర్చు మాటేంటి?
దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారీ మొత్త ంలో ఖర్చవుతుం ది. అయితే ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే మాత్రం ఇది బాగా తక్కువే. సగటున ఒక్కో ఓటరుకు సుమారు రూ.84 వరకు (అంటే ఒక అమెరికన్ డాలరు) మన దేశంలో ఖర్చవుతుంది. ఇందులోనే ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, ఎన్నికల విధులకు ఉద్యోగులను తరలించడం, ఈవీఎంల ఏర్పాటు వంటి ఖర్చులన్నీ ఉం టాయి. కెన్యాలో ఈ ఖర్చు ఒ క్కో ఓటరుపై 25 డాలర్లు. అంటే దాదాపు రూ.2,077 వరకు ఖర్చు చేస్తున్నారు. మన దాయాది దేశం పాకిస్తాన్ సైతం గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో ఓటరుపై 1.75 డాలర్లు ఖర్చు చేసింది. ఎంతగానో అభివృద్ధి చెందిన అమెరికాలో అయితే.. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 98 డాలర్లు సగటున ఒక్కో ఓటరుకు ఖర్చయింది. మన దేశంలో ఎన్నికల నిర్వహణకు సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అదే సమయంలో రాజకీయ పార్టీలు అధికారిక లెక్కల ప్రకా రం రూ.60వేల కోట్లు ఖర్చుచేస్తాయి. విడిగా ఓటర్లకు పంచే డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు అన్నీ లెక్క పెట్టుకుంటే అది కొన్ని లక్షల కోట్లు అవుతుంది.
ఈవీఎంల మాటేంటి?
ఈ ఎన్నికల కోసం మొత్తంగా 35 లక్షల ఈవీఎంలు అవసరం పడతాయని ఎన్నికల సంఘం తెలిపింది. దీని కోసం కొత్త ఈవీఎంలను కొనుగోలు చేయాల్సినవసరం ఉందని చెప్పింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎం ధర సుమారు రూ.17 వేలు. వీవీప్యాట్ ధర కూడా దాదాపు అంతే ఉంటుంది. జమిలి ఎన్నికలు పెట్టాలంటే కొత్తగా 15 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం అవుతాయి. వాటిని సిద్ధం చేసి, ఎన్నికల కమిషన్‌కు అందజేయడానికి ఏడాదికి పైగా పడుతుంది.
సి.ఎస్.శర్మ
– 98858 09432