IND vs NZ : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డేల్లో కివీస్‌తో తలపడేందుకు టీమ్ఇండియా సిద్దమైంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో ఈ సిరీస్‌లో సత్తా చాటి తాము మెగా టోర్నీలో రేసులో ఉన్నామని చాటి చెప్పాలని పలువురు ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు.
ఆక్లాండ్ వేదికగా శుక్రవారం కివీస్, భారత్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. తుది జట్టు ఎంపిక పై టీమ్ఇండియా పెద్ద కసరత్తే చేయాల్సి వస్తోంది. సంజూ శాంసన్ , ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లకు పొట్టి ఫార్మాట్‌లో అవకాశం రాకపోవడంతో కనీసం వన్డే సిరీస్‌లోనైనా అవకాశం ఇస్తారా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.
ఆ ఇద్దరికి చోటు కష్టమే..!
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఈ సిరీస్‌కు సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఓపెనర్‌గా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు బరిలోకి దిగడం ఖాయం. గత సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ సత్తాచాటడంతో అతడి స్థానానికి డోకా లేదు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ కావడంతో అతడు ఖచ్చితంగా ఆడతాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా ఉండడంతో సంజు శాంసన్‌కు జట్టులో చోటుదక్కుతుందా అంటే కష్టమేనని అంటున్నారు.
ఇక బౌలింగ్‌లో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లు ఉండడం, టీ20 ఫార్మాట్‌లో అద్భుతాలు చేస్తున్న అర్ష్‌దీప్ వన్డేల్లోనూ అరంగ్రేటం చేసే అవకాశం ఉండడంతో ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కడం కష్టమే. స్పిన్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ద్వయం ఎలాగు ఉన్నారు.