Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం పేదలకు మరో శుభవార్త అందించింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన డిసెంబర్ 28వ తేదీన తొలి విడత డబ్బులు కింద రూ.6వేలు ఖాతాల్లో వేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడం మాత్రమే బీఆర్ఎస్ నాయకులకు తెలుసని ఎద్దేవా చేశారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరగనుందని వెల్లడించారు. అలాగే అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు భట్టి పేర్కొన్నారు.