Bigg Boss-8 Winner: బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) విజేతకు ట్రోఫీ అందించారు. ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇందులో ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్, అవినాష్ టైటిల్ కోసం పోటీపడ్డారు. చివరకు నిఖిల్ విజయం సాధించినట్లు హోస్ట్ నాగార్జున(Nagarjuna) ప్రకటించారు. ఇక గౌతమ్ రన్నరప్‌గా నిలిచారు. విజేతగా నిలిచిన నిఖిల్ రూ.55లక్షల నగదుతో పాటు మారుతి సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారు బహుమతిగా అందుకున్నారు.
మరోవైపు గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో గత సీజన్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ స్టూడియో వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్ 17న ముగిసిన బిగ్‌బాస్-7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.