తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)లు ఆందోళనకు దిగారు. లగచర్ల(Lagacharla) రైతుల అరెస్టుపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. అలాగే గుండెనొప్పితో బాధపడుతన్న రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) మాట్లాడుతూ.. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన సర్కార్.. యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని మండిపడ్డారు. 2027లో జమిలి ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.