ప్రభుత్వం సర్పంచ్‌ల(Sarpanch)ను చిన్న చూపు చూస్తోందని అసెంబ్లీ(Assembly)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. జీపీ జనరల్ ఫండ్స్‌కు సంబంధించి ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో పంచాయతీల్లో చెక్కులు పాస్ అవ్వక సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం మాత్రం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోందని ఫైర్ అయ్యారు. ఒక్క నవంబర్ నెలలోనే బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లిచిందని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా చెల్లించపోవడం దారుణమని ధ్వజమెత్తారు. భార్య మెడలోని పుస్తెలను అమ్మి గ్రామాల్లో సర్పంచులు అభివృద్ధి పనులు చేశారని.. అలాంటి వారికి ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ఆయన నిలదీశారు. ఏడాది కాలంగా సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.691 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ.. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే సర్పంచ్‌లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల లోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.