Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి గాయమైంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా డార్లింగ్ గాయపడ్డారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జపాన్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఆ దేశంలో నిర్వహించే ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాల్గొనాల్సి ఉండగా.. కాలికి గాయం కావడంతో రాలేనంటూ జపాన్ ప్రేక్షకులకు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్పగాయమవడంతో రాలేకపోతున్నా’’ అని పేర్కొన్నారు. కాగా ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.
ఇక డార్లింగ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఫౌజీ’లో నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్2’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) చిత్రాల్లోనూ నటించాల్సి ఉంది.