రేపు(మంగళవారం) లోక్‌సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill)ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాలే(Arjun Ram Meghwal) ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee)కి పంపనున్నారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ(NDA)కు 293 మంది ఎంపీల మద్దతు ఉండగా.. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
తొలుత ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి బిజినెస్ జాబితాలో బిల్లులను లిస్ట్ చేసింది. అయితే తర్వాత వెనక్కి తీసుకున్న కేంద్రం.. రేపు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. కాగా ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గంలో జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా పార్లమెంట్ నుంచి పంచాయతీ ఎన్నిలకు ఒకేసారి నిర్వహించాలని ప్రధాని మోదీ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, పార్టీలతో చర్చించి ఎన్నికల నిర్వహణపై సాధ్యసాధ్యాలను ఓ నివేదికలో రూపొందించింది. ఈ నివేదికను ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించిన సంగతి తెలిసిందే.