Ilayaraja: దిగ్గజ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాకు ఆలయంలో అవమానం జరిగిందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్ దేవాలయంలోని గర్భగుడికి వెళ్లిన ఇళయరాజాను అక్కడున్న పూజారులు అడ్డుకుని బయటకు పంపించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటికే ఆండాళ్ ఆలయ కార్యనిర్వహణాధికారి వివరణ ఇచ్చారు. గర్భగుడి ఎదుట ఉన్న అర్థ మండపంలో ఉత్సవ విగ్రహాలను శాశ్వతంగా ఉన్నందున జీయర్లకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నారు.
తాజాగా ఈ వార్తలపై ఇళయరాజా స్వయంగా స్పందించారు. “నన్ను కేంద్రబిందువుగా చేసుకుని కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ పుకార్లే. నేను ఎప్పుడూ, ఎక్కడా ఆత్మగౌరవాన్ని వదులుకోను. జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ పుకార్లను అభిమానులు, ప్రజలు నమ్మవద్దు” అని ఓ ప్రకటనలో వెల్లడించారు.