తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అనంతరం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కరాష్ట్ర అప్పుల వివరాలను సభలో ప్రకటించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని వెల్లడించారు.
అయితే భట్టి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క అని తప్పుగా పలికారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కలుగజేసుకుని డిప్యూటీ స్పీకర్ కాదని.. డిప్యూటీ సీఎం అని తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన సీఎం అవుతారేమో.. భట్టి సీఎం కావాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హరీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.