లోక్‌సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill) ప్రవేశపెట్టేందుకు అనుమతి వచ్చింది. ఓటింగ్‌లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు.
అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాలే(Arjun Ram Meghwal) ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. చర్చ అనంతరం బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు.
హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ చేపట్టారు. కొంతమంది సభ్యులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా.. మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్లో ఓటు వేశారు. 269 మంది సభ్యులు బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఓటేయగా.. 198 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా ఈ బిల్లుకు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.