ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై(Allu Arjun) ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య(POW Sandhya) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు. అల్లు అర్జున్ ఏదో యుద్ధంలో గెలిచి త్యాగం చేసినట్లు ఇండస్ట్రీ మొత్తం పరామర్శించారని ధ్వజమెత్తారు. కానీ వెంటిలేటర్ మీద చావుబతుకుల మధ్య ఉన్న బాలుడిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
ఇక బాలుడి ఆరోగ్యంపై తమకు అనుమానాలున్నాయని.. తక్షణమే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని.. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు. ఈ కేసులోనే అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా..హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బన్నీ విడుదలయ్యారు.