తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విమర్శలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అసెంబ్లీలో లగచర్ల రైతులపై దాడి ఘటన గురించి చర్చ జరపకపోవడంపై ఆయన మండిపడ్డారు. అలాగే సభలో టూరిజంపై చర్చ జరపడంపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గంలో రైతుల మీద టెర్రరిజం.. అసెంబ్లీలో టూరిజం మీద చర్చలు.. ప్రభుత్వం ప్రాధాన్యతలు అద్భుతం అంటూ సెటైర్లు వేశారు.
ఇక ఇండియాలోనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై 23 కిలోమీటర్ల మేర నిర్మించిన మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ తొలగించడాన్ని కూడా కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇంతకంటే మూర్ఖమైన ప్రభుత్వం దేశంలో ఉందా? అని విరుచుకుపడ్డారు. కాగా సైకిల్ ట్రాక్‌ను గ్రేటర్ హైదరాబాద్ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నార. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా కొంతవరకు సైకిల్ ట్రాక్ తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.