పాలకుర్తిలోని ప్రముఖ క్షీరగిరి క్షేత్రమైన శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మార్గశిర మాసం అందులో సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో గర్భాలయంలోని స్వయంభు సోమేశ్వరుడుకి ఆరుద్రోత్సవం నేత్రపర్వంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, భజన, శివ నామ సంకీర్తనలతో సోమేశ్వరాలయం మార్మోగింది. వేదమంత్రాలతో గణపతి పూజ, కలశపూజ వేద పండితులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ శర్మ, దేవగిరి సునీల్ శర్మ లు శాస్త్రోత్తంగా నిర్వహించారు.
ఉపవాస దీక్షలతో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. 58 కళశాలతో సోమేశ్వరుడికి 108 లీటర్ల ఆవుపాలతో క్షీరాభిషేకం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు సోమేశ్వరుడికి విశేష పుష్పాలంకరణ చేశాక, గర్భాలయంలో 1016 నెయ్యి దీపాలు వెలిగించారు. దీప కాంతులతో పరమశివుడు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. శంభో శంకర…హర హర శంకర.. జయ జయ శంకర నామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.