తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) భూభారతి బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్‌ను(Dharani Portal) బంగాళాఖాతంలో పడేశామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తమ ఇంటి సంస్థగా వాడుకుందని ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది సమస్యలు వచ్చాయన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం అవ్వాల్సిన సమస్యలు కూడా కోర్టులకు చేరాయని గుర్తుచేశారు. భూయజమానికి తెలియకుండానే భూములు తారుమారు అయ్యాయని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆర్వోఆర్(ROR) చట్టం-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తగా భూభారతి చట్టాన్ని(Bhu Bharathi Bill) తెచ్చామన్నారు. ఈ చట్టం రూపకల్పనలో బీఆర్ఎస్ కీలక నేతలైన హరీష్‌రావు(Harish Rao), వినోద్(Vinod) లాంటి వాళ్ల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టంచేశారు. భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో ఇష్టారాజ్యంగా దోచుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు.