‘పుష్ఫ2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తాజాగా బాలుడిని అల్లు అర్జున్(Allu Arjun) తండ్రి, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆసుపత్రిలో పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కాగా శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు మంగళవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తొక్కిసలాటలో గాలి ఆడక తీవ్రంగా గాయపడటం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరిగా అందటం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ శ్రీతేజ్‌ను పరామర్శించారు. బాలుడి పరిస్థితి విషమంగానే ఉందని.. చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించిన విషయం విధితమే.