జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం కాగజ్నగర్ డిఎస్పి రామానుజం పెంచికల్పేట్ మండలంలోని అగర్ గూడ గ్రామంలో గల చౌదరి చిన్నయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి అవసరాల నిమిత్తం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. చౌదరి చిన్నయ్య సోదరి అంకు బాయ్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా సంఘవిద్రోశక్తులలో తిరుగుతున్న సమాచారం మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆదివాసీలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని డిఎస్పీ తెలియజేసారు.
మెరుగైన జీవితం గడపండి
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని యువత, పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి మెరుగైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
కొత్తోళ్లు వస్తే చెప్పండి
గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. మావోయిస్టులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని ఆదివాసి ప్రజలను కనీస సౌకర్యాలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత మావోయిస్టులకు మనుగడ లేక మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని తెలియజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు. యువత అసాంఘిక శక్తుల వైపు మరలవద్దని పిలుపునిచ్చారు. మావోయిస్టులు కూడా వారి కాలం చెల్లిన సిద్ధాంతాల ద్వారా సాధించేది ఏమీ లేదని, వారికోసం వారి కుటుంబం, వారి ఊరు ఎదురు చూస్తోందని, వారు తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలని, సమాజంలో మమేకం కావాలని పోలీసులు తెలిపారు.